పోలీస్ అమరవీరులకు ప్రధాని మోదీ ఘనంగా నివాళులు

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చాణక్యపురిలో నిర్మించిన జాతీయ పోలీస్ స్మారక స్థూపాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రధాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. భరతమాత బిడ్డలైన పోలీస్ అమరవీరులకు దేశం యావత్తూ ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా నేతాజీ సుభాస్ చంద్ర బోస్ గౌరవార్ధం ఒక అవార్డు ను ప్రవేశ పెడుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. విపత్తు నిర్వహణ కార్యకలాపాలలో ప్రజల ప్రాణాలు కాపాడటంలో ధైర్య, సాహసాలు ప్రదర్శించిన వారికి ప్రతి ఏడాది ఈ అవార్డు బహుకరింప గలమని చెప్పారు.

‘‘జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతలను కాపాడుతూ, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి జవానును గుర్తుచేసుకోవాల్సిన రోజు ఇది... నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సైనికులు అద్భుతంగా పనిచేస్తున్నారు. వారి కారణంగానే నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. యువకులు జన స్రవంతిలో కలుస్తున్నారు...’’ అని ప్రధాని పేర్కొన్నారు.

భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండబట్టే విచ్ఛిన్నకర శక్తులు తోకలు ముడుస్తున్నాయనీ, దేశంలో అభద్రతాభావాన్ని, భయందోళనలను సృష్టించాలనుకున్న వారి ప్రయత్నాలను సైనికులు సమర్థంగా నిలువరిస్తున్నారని ప్రధాని కొనియాడారు. ‘‘దేశంలో శాంతి నెలకొందంటే అది కేవలం మీ సేవల ద్వారానే సాధ్యం అయ్యింది’’ అని ప్రధాని పేర్కొన్నారు.

1959లో లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో చైనా దళాలు జరిపిన మెరుపుదాడిలో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని పురస్కరించుకుని ప్రతియేటా అక్టోబర్ 21న భారత ప్రభుత్వం పోలీస్ సంస్మరణ దినోత్సవం జరుపుతోంది. ఇవాళ జరిగిన పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం వేడుకల్లో ప్రధాని మోదీ పాటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ సహా పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.