‘తిత్లీ’ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి : చంద్రబాబు

తిత్లీ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తిత్లీ తుపాను నష్టం రూ.3,435 కోట్ల అని, తాత్కాలిక సహాయంగా రూ. 1,200 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. గతంలో రాసిన లేఖకు పీఎంవో నుంచి స్పందన లేకపోవడంతో ఆవేదనతో మరో లేఖ రాస్తున్నట్టు చంద్రబాబు తన రెండో లేఖలో ప్రస్తావించారు. కనీసం కేంద్ర బృందం కూడా తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదని సీఎం పేర్కొన్నారు. 

తుపాను నష్టంపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ కు విజ్ఞాపన పత్రం ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. తక్షణ సహాయ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. 2.25 లక్షల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని,  వీరికి సహాయ పునరావాసం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర బృందాన్ని పంపి తుపాను నష్టాన్ని అంచనా వేయాలని ముఖ్యమంత్రి డిమాండ్‌ చేశారు.  

‘‘తుపాను బీభత్సానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 1,802 గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 16 మంది చనిపోయారు. అపార పంట నష్టం జరిగింది. కొబ్బరి, జీడి మామిడి తోటలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా తుపాను దెబ్బకు మరో 20 సంవత్సరాలు వెనక్కు వెళ్లిపోయింది. నాటి ప్రకృతి బీభత్సాన్ని తలుచుకుని జిల్లా ప్రజలు ఇప్పటికీ ఉలిక్కి పడుతున్నారు. గత పది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తోంది’’ అని సీఎం తన లేఖలో పేర్కొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాల వారీగా ప్రాథమిక నష్టం అంచనాలు, సహాయ పునరావస కార్యక్రమాల వివరాలను ప్రధానికి రాసిన లేఖలో పొందుపరిచారు. ఈ నెల 22 నాటికి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాల సేకరణ పూర్తవుతుందని చెప్పారు. ‘‘నేను నా మంత్రి వర్గ సహచరులు 15 మందితో కలసి వారం రోజులు తుపాను ప్రభావిత ప్రాంతంలోనే మకాం వేసి సహాయ, పునరావాస కార్యక్రమాల్ని పర్యవేక్షించాను. ఇప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

1,802 గ్రామాల్లో విద్యుత్‌ వ్యవస్థ ధ్వంసమైందని, ఇంత వరకు 1,392 గ్రామాల్లో పునరుద్ధరించామని, మిగతా గ్రామాల్లో ఈ నెల 25కి పూర్తవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. తాగునీటి వనరులన్నీ దెబ్బతిన్నాయని, 50 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయని, 1.65 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 40 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు  నాశనమయ్యాయని వివరించారు.

629 కి.మీ.ల పొడవైన రహదారులు దెబ్బతిన్నాయని, ఆరు మున్సిపాలిటీల్లో రహదారులు, వీధి దీపాలు పాడయ్యాయిని, 144 చిన్న నీటి పారుదల వనరులు, వంశధార కాలువలు దెబ్బతిన్నాయని చెప్పారు.