అభ్యర్థులతో పాటు సీనియర్ నాయకులతో 21న కెసిఆర్ భేటీ

రానున్న ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులతో పాటు సీనియర్ నాయకులతో 21వ తేదీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు భేటీ కానున్నారు. వారికి రెండోవిడత ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్నారు. దీంతోపాటు పలువురు అభ్యర్థులు ప్రచారంలో వెనుకబడి పోవడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం, అసమ్మతి నాయకులను, కార్యకర్తలకు కలుపుకోవడంలో విఫలమవుతున్నారని పార్టీ గుర్తించింది. అందులో భాగంగా అలాంటి వారికి కెసిఆర్ క్లాస్ తీసుకోనున్నట్టు కూడా తెలిసింది.

30 నుంచి 40 మంది అభ్యర్థుల విషయంలో కెసిఆర్ సీరియస్‌గా ఉన్నారని, ప్రచార విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆ నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలను ఎలా ఎక్కుపెట్టాలన్న దానిపైనే ఎక్కువగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

వాటితో పాటు అభ్యర్థుల తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు, వారు ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలు తిరిగారు, ప్రచారంలో అభ్యర్థులు ఎన్ని సార్లు పాల్గొన్నారు, కిందిస్థాయి కార్యకర్తలు సహకరిస్తున్నారా లేదా సహకరించపోతే ఎందుకు సహకరించడం లేదు అన్న విషయాలపై ఇప్పటికే కెసిఆర్ సర్వే ద్వారా రిపోర్టులు తెప్పించుకున్నారు. ఆ నివేదికలను ముందు పెట్టుకొని అభ్యర్థులతో కెసిఆర్ ప్రత్యేక సమావేశం కానున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికోసం సీనియర్ నాయకులతో ఇప్పటికే కెసిఆర్ చర్చించారని అభ్యర్థులతో పాటు జిల్లాల ఇన్‌చార్జీల తో కూడా ఆయన భేటీ కానున్నట్టు సమాచారం.

తాత్కాలిక మ్యానిఫెస్టోలో భాగంగా ఆయన ప్రకటించిన పలు అంశాలను అభ్యర్థులతో చర్చించడంతో మరిన్ని పథకాలు ఎలా ఉంటో బాగుంటుందో అన్న దానిపై వారి నుంచి సమాచారం సేకరించాలని గులాబీ బాస్ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ భేటీకి అభ్యర్థులంతా కచ్చితంగా హాజరుకావాలని కెసిఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్ పార్టీయే లక్షంగా కొందరు నేతలు విరుచుకుపడుతుంటే మరికొందరు మాత్రం కావాలనే పట్టీపట్టనట్టు వ్యవహారిస్తున్నారని కెసిఆర్ దృష్టికి వచ్చింది. అభ్యర్థులతో భేటీ అనంతరం కెసిఆర్ ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయించినట్టు తెలిసింది. విరామం లేకుండా నియోజకవర్గాల వారీగా సభలను నిర్వహించాలని దీనికోసం ఇప్పటికే షెడ్యూల్‌ను సైతం తయారు చేయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పలు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు నెలకొన్న పరిస్థితులపై కెసిఆర్ సమీక్ష చేయనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎన్నికలకు మరో 50 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సుమారు 100 సభల్లోనైనా ఆయన పాల్గొనాలని, దీనికోసం సీనియర్ నాయకులు సైతం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నట్టు తెలిసింది. కెసిఆర్‌తో పాటు కెటిఆర్ కూడా పలు సభల్లో పాల్గొంటారని దీనిపై అభ్యర్థుల నుంచి వినతుల వచ్చిన నేపథ్యంలో కెసిఆర్ దానిపై కూడా సమీక్ష జరపనున్నట్టు తెలిసింది.