తెలుగు దేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడిగా భావిస్తున్న సిఎం రమేష్ కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు రూ.800 కోట్లను వివిధ కంపెనీల ద్వారా దారి మళ్లించిందని ప్రాథమికంగా నిర్థారించినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.100 కోట్ల మళ్లింపుపై పూర్తి ఆధారాలు లభించగా మరో రూ.700 కోట్ల మేరకు అనుమానాస్పద లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు.
సబ్ కాంట్రాక్టుల ముసుగులో పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి బిల్లులు కాజేయటం, ఆ డబ్బులను చిరునామా లేని కంపెనీల్లోకి మళ్లించి తరువాత వాటి నుంచి సీఎం రమేశ్ సంస్థ నగదు వెనక్కి తీసుకున్నట్లు గత వారం రోజులుగా ఆదాయపన్ను శాఖ సోదాల్లో కచ్చితమైన ఆధారాలు లభ్యమయ్యాయని చెబుతున్నారు
అధికార పార్టీకి చెందిన కీలక యువనేతతో దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా ప్రచారంలో ఉన్న ఓ సాంప్రదాయ ఇంధన తయారీ రంగంలోని కంపెనీలోకి ఈ రూ.700 కోట్లను రమేష్ సంస్థ తరలించినట్లుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. సీఎం రమేష్‌కు చెందిన కంపెనీలు అంజనాద్రి పవర్, కడప పవర్, నారాయణాద్రి గ్రీన్ఎనర్జీ, కదిరి గ్రీన్‌పవర్, రిత్విక్ గ్రీన్‌పవర్‌ల నుంచి ప్రవాహంలా నిధులను ఈ సంప్రదాయ ఇంధన తయారీ కంపెనీలోకి తరలించినట్లు భావిస్తున్నారు.
సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ సుమారు రూ.100 కోట్లను నకిలీ కంపెనీల పేరుతో తరలించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రూ.74 కోట్లను చిరునామా లేని కంపెనీల్లోకి తరలించగా మరో రూ.25 కోట్లను అనుమానాస్పద లావాదేవీలుగా గుర్తించినట్లు ఐటీ శాఖ రూపొందించిన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా సబ్‌కాంట్రాక్టుల ముసుగులో భారీఎత్తున నిధులను దారి మళ్లించినట్లు తేలింది. గత ఆరేళ్లలో ఎడ్కో(ఇండియా) అనే సబ్‌కాంట్రాక్టర్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్లు పుస్తకాల్లో చూపించగా రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఎక్కడా ఈ కంపెనీ ఆనవాళ్లు లభించలేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది.
రిత్విక్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా, ఎడ్కో అనే నకిలీ కంపెనీ మధ్య పలు లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. సాయిబాబా వద్ద ఎడ్కో కంపెనీకి చెందిన స్టాంపులు, స్టీలు దొరికాయని, దీన్నిబట్టి నిధులు తరలించిడానికే ఎడ్కో కంపెనీని వాడుకున్నట్లు అర్థమవుతోందని ఐటీ శాఖ తన నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో రూ.33 కోట్ల అనుమానాస్పద లావాదేవీలను కూడా ఐటీ అధికారులు గుర్తించారు.
ఇందులో రూ.25 కోట్లు కొనుగోళ్లు కోసం వెచ్చించినట్లు చూపగా అందులో రూ.23 కోట్లు నగదు రూపంలో వెనక్కి వచ్చేశాయి. ఈ లావాదేవీల గురించి ఐటీ అధికారులు కంపెనీ అకౌంటెంట్, డైరెక్టర్‌ను ప్రశ్నించగా జవాబు చెప్పలేకపోవడం గమనార్హం.
స్టీల్ సప్లయిర్స్ నుంచి రూ.12.24 కోట్లు వచ్చినట్లు చూపించగా దీనికి సంబంధించిన నగదు లావాదేవీలను వివరించలేకపోయారు. స్టీల్ సప్లయిర్స్ నుంచి 2 శాతం కమీషన్ రూపంలో మొత్తం రూ.7.98 కోట్లు వచ్చినట్లు చూపించడంపై కూడా ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీకి చెందిన సబ్‌కాంట్రాక్టర్ ఎన్‌కేజీ కన్స్ట్రక్షన్స్కు రూ.6 కోట్లు చెల్లింపులు జరపగా దానికి సరైన బిల్లులు లేవు.
రిత్విన్ కంపెనీలో ఓ వ్యక్తి కంపెనీ తరుఫున రూ.2.97 కోట్లు రుణం తీసుకొని ఆ మొత్తాన్ని వ్యక్తిగత అవసరానికి వాడుకున్నట్లు గుర్తించారు. స్టీలు కొనుగోళ్లకు సంబంధించి ఆక్ స్టీల్స్, బీఎస్కే సంస్థలకు చేసిన రూ.25 కోట్ల చెల్లింపులను కూడా ఐటీ శాఖ అనుమానాస్పదమైనవిగా గుర్తించింది. ఇవి కాకుండా సోదాల్లో సీఎం రమేష్ ఇంటి నుంచి రూ.13 లక్షలు, రూ.2.22 లక్షల విలువైన 3,000 అమెరికన్ డాలర్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.