తిత్లీ బాధితులను కేంద్ర సాయంపై కన్నా భరోసా

తిత్లీ తుపాను బాధితులను కేంద్రం ఆదుకుంటుందని రాష్ట్ర బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భరోసా ఇచ్చారు. బాధిత ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని కేంద్రానికి వివరించి, కేంద్ర బృందం వచ్చి పరిశీలించేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు. తిత్లీ తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఈ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం తీవ్రంగా నష్టపోయిందని విచారం వ్యక్తం చేసారు. జీడి, మామిడి, కొబ్బరి పంటలకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని, పచ్చగా ఉండాల్సిన ప్రాంతం స్మశానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఇక్కడ నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్‌కు ఇప్పటికే నివేదిక అందజేశామని తెలిపారు. రాష్ట్ర బిజెపి పక్షాన్న మృతుల కుటుంభాలకు రూ 10 వేలు చొప్పున సహాయం అందిస్తామని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం బారువ, బారువ కొత్తూరు, మందస మండలంలోని హరిబంద, గొల్లలపాలెం, బేతాళపురం, రట్టి, నారాయణపురం, బహాడపల్లి గ్రామాల్లో పర్యటించారు.

ఇక్కడ సహయక చర్యలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయని కన్నా విమర్శించారు. ఇప్పటికైనా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరందించమని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శవాలమీద పెంకులేరుకోవాలనే ఆలోచనలు మానుకోవాలని హితవు చెప్పారు.

హూద్ హుద్ కంటే ఎక్కువగా రైతుకు పెద్ద నష్టం కలిగిందని చెబుతూ  చంద్రబాబుకు రాజకీయాలు కావాలని, తమకు సమస్యలు కావాలని తెలిపారు.  రాజకీయాలతో ఈ ప్రాంతానికి లాభం జరగదని, కేంద్రం ఉదారంగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. సీఎం తన ప్రచారం కోసం అధికారులను వెంటేసుకుని తిరుగుతున్నాడని ద్వజమెత్తారు. ‘‘తుఫాన్‌ను అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకోవద్దు. ఈరోజు పది గ్రామాల్లో పర్యటించా... ఆ గ్రామాల్లో ఎక్కడా తాగునీరు కూడా అందడం లేదు. నిజంగా నష్టపోయిన ప్రాంతాలకు ఏమీ అందడం లేదు” అని విచారం వ్యక్తం చేసారు.