అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరిన స్వామి పరిపూర్ణానంద

శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద అమిత్ షా సమక్షంలో ఢిల్లీ లో బిజెపిలో చేరారు. అమిత్‌షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌లతో భేటీ అనంతరం వారి ఆహ్వానం మేరకు పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తమ పార్టీలోకి వచ్చిన పరిపూర్ణానందకు అమిత్‌ షా తన నివాసంలోనే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయనకు ప్రాథమిక సభ్యత్వ రసీదును అందజేశారు.

ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ సన్యాసి అయిన తాను ఏమీ ఆశించి బిజెపిలో చేరడం లేదని, ఒక కార్యకర్తగా పార్టీ విధానాలను ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని చెబుతూ బిజెపి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. తెలుగు ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని అంతకన్నా తనకు మరేమీ అవసరం లేదని అంటూ పార్టీ ఏ బాధ్యత అప్పచేప్పినా, ఏ కార్యక్రమం అప్పచేప్పినా నెరవేరుస్తానని స్పష్టం చేసారు.

 ‘‘నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు పూర్తి నిరాహారంగా ఉండి ఆత్మపరిశీలన చేసుకున్నాను. నేను రాజకీయాలకు తగుతానా? ఇమడగలనా? పనిచేయయగలనా?.. ఇలా అన్ని రకాలుగా ఆలోచించుకున్నాకే బిజెపిలో చేరాను” అని ప్రకటించారు. “నా దీక్షకు విజయ దశమితో పది రోజులు పూర్తయ్యాయి. నిన్ననే భోజనం తీసుకున్నా. దేశం కోసం, ధర్మం కోసం ఏ సూత్రాలను, సిద్ధాంతాలను ఆరెస్సెస్‌ కొనసాగిస్తూ వచ్చిందో వాటిని రాజకీయ కోణంలో సమాజానికి మరింత చేరువ చేసే దిశగా బిజెపి కృషిచేస్తోంది. సబ్‌కా సాత్‌ - సబ్‌కా వికాస్‌ నినాదంతో ముందుకెళ్తోంది. దేశ ప్రజలందరి అభివృద్ధిని కోరుకునే సూత్రమిది. కొత్తగా బిజెపి ప్రవేశపెట్టింది కాదు. హిందూ సంస్కృతిలోఉన్నదే ఈ నినాదం” అని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో 29 రాష్ట్రాల్లో కమలాన్ని వికసింపజేసే విధంగా, ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ్‌ భారత్‌ అనే ప్రధాని మోదీ నినాదాన్ని ప్రతిఫలించే దిశగా నిబద్ధతతో పనిచేస్తోన్న బిజెపి ఈ దేశానికి చాలా అవసరం అని స్పష్టం చేసారు. బిజెపి ఓ సైన్యం. కార్యకర్తలంతా సైనికులు. నేటి సమాజానికి ఆధ్యాత్మికత ఎంత అవసరమో.. సంస్కృతిని కాపాడే మరిన్ని అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఎలా పరిరక్షించవచ్చో ఆలోచించి.. రాంమాధవ్‌తో గతంలోనే చర్చించాను అని వెల్లడించారు.

“అనతరం అమిత్‌ షాతోనూ 45 నిమిషాల పాటు చర్చించా. ధర్మాన్ని నిలుపుకోకపోతే దేశానికి ఉనికి లేదు. ఈ దేశ ఉనికే ధర్మం. దాన్ని నిలబెట్టుకోవాలనేది మహత్తరమైన ఆలోచన అని గతంలో జరిగిన భేటీలో అమిత్‌ షా నాతో అన్నారు. తొమ్మిది రోజుల దీక్ష తీసుకొని విజయదశమి నాడు వస్తానని ఆయనతో చెప్పాను. పూర్తిగా ఆత్మపరిశీలన చేసుకున్నాకే ఈ రోజు బిజెపిలో చేరాను” అని వెల్లడించారు.

మోదీ, అమిత్‌షా, రామ్‌మాధవ్‌ మార్గదర్శకత్వంలోనే పనిచేస్తానని ఈ సందర్భంగా స్వామి ప్రకటించారు. వారేం చేయమన్నా.. తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశంలో ఏమూలకు పంపినా చిత్త శుద్ధితో పనిచేస్తానని చెప్పారు. రోజుకు 17గంటల పాటు పనిచేయగలనని మాట ఇస్తున్నాను అని పేర్కొన్నారు. అమిత్‌షా, రామ్‌మాధవ్‌ అనుభవాలను కూడగట్టుకొని దేశానికి, ధర్మ పరిరక్షణకు నా ఊపిరి ఉన్నంత వరకు పనిచేస్తానని తెలిపారు.

“తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. మా గురువు నాకు పరిపూర్ణానంద స్వామి అని పేరుపెడితే తెలుగు ప్రజలు నాకు పరిపూర్ణత ఇచ్చారు. వారిచ్చిన స్థానం పదవి కంటే గొప్పది. ఆ స్థానం మహత్తరమైన దానికి ఉపయోగపడాలి. ప్రజల కోరికలను నెరవేరుస్తా. నా భగవద్గీత ఆపను. నా సాధన ఆపుకోను. ప్రజాక్షేత్రంలో ఉన్నాను గనక సాధనను మరింత కఠినతరం చేసుకోవాలి. నాపై ఇంకా రెట్టింపు బాధ్యత పడింది. ఈ రాజకీయ ఆటను సక్రమంగా ఆడతాను’’ అని పరిపూర్ణానంద ఉద్వేగంతో వివరించారు.

రెండు తెలుగు రాష్త్రాలలో వేల సంఖ్యలో శిష్యులు ఉన్న స్వామి పరిపూర్ణానంద అనేక ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. భారత్ టుడే పేరుతో తెలుగు టివి చాన్నల్ కూడా నిర్వహిస్తున్నారు. ఆయన చేరికతో రెండు రాష్త్రాలలో బిజెపికి బలమైన మద్దతు లభించగలదని భావిస్తున్నారు.