చంద్రబాబు బినామీ సీఎం రమేష్‌

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బినామీ ఆ పార్టీ ఎంపి సీఎం రమేష్‌ అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు ఆరోపించారు. సీఎం రమేశ్‌ దిగజారుడు మనిషని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్‌ను రాజ్యసభకు పంపినందుకు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెంటనే రాజ్యసభ సభ్యత్వం నుంచి తొలగించాలని కోరారు.

జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలపై సీఎం రమేశ్‌ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మీసం మెలేసిన సీఎం రమేష్‌ జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలతో మీసం తీయించుకుంటారా అని సవాల్‌ విసిరారు. సీఎం రమేష్ తప్పుడు వ్యాపారాలు చేస్తున్నారని పేర్కొంటూ రూ.100 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టి దొంగ దీక్షలు చేశారని ఆరోపించారు. సొంత కంపెనీ అకౌంట్స్‌లోనే దొంగ లెక్కలు చూపించే వ్యక్తిని చంద్రబాబు పబ్లిక్ అకౌంట్స్ నెంబర్‌గా చేశారని ఎద్దేవా చేసారు.

సీఎం రమేష్ లాంటి వ్యక్తుల వల్ల పార్లమెంట్ పరువుపోతుందని ధ్వజమెత్తారు. తక్షణమే రమేష్‌ను పెద్దల సభ నుంచి రమేష్‌తో రాజీనామా చేయించకపోతే ఎతిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సీఎం రమేష్‌ వ్యవహరించే తీరు, పార్లమెంటు సభ్యులకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవని అభిప్రాయపడ్డారు. సీఎం రమేష్‌ అవినీతిపై కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. సీఎం రమేశ్‌ వాడే బాష పార్లమెంటు సంప్రదాయానికి విరుద్ధంగా ఉందని ద్వజమెత్తారు.

రాష్ట్రంలో ఐటీ పేరుతో చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లు లూటీ చేస్తున్నారని జీవీఎల్‌ ఆరోపించారు. ఐటీ కంపెనీల పేరుతో చంద్రబాబు భూకుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకూ భూ కేటాయింపుల్లో కనిపించిన కంపెనీలు రాష్ట్రానికి వచ్చిన దాఖలాలే లేవని చెప్పారు. ప్రభుత్వం కేటాయించిన కంపెనీలన్నీ లోకేష్‌ బినామీలేనని విమర్శించారు.

ఇష్టం వచ్చినట్లు భూములు కేటాయిస్తున్నారని మండిపడుతూ సమాచార చట్టం ద్వారా ఐటీ కంపెనీలకు కేటాయించిన వివరాలు అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని లూటీ చేయడానికి లోకేష్‌కు ఐటీ మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. 24 గంటల్లో ఐటీ కంపెనీలకు ఇచ్చిన భూముల వివరాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఐటీ కంపెనీల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని స్పష్టం చేసారు.