రాహుల్ పర్యటనలో వెల్లడైన అంతర్గత కుమ్ములాటలు

ఎన్నికల సంవత్సరంలో పార్టీలోని అన్ని వర్గాలు కలిసి పనిచేసేటట్లు చేయడం కోసం రెండు రోజుల తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ వస్తే, ఆయన పర్యటన గందరగోళంగా జరగడం, పలు సమావేశాలలో తమకు ప్రవేశం లేకపోవడం పట్ల సీనియర్ నేతలు అలక బూనడంతో కాంగ్రెస్ వర్గాలలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు బహిర్ఘతం అయ్యాయి. పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో తాను వారి నుండి ఫిర్యాదులు వినడానికి రాలేదని, కేవలం వచ్చే ఎన్నికలలో గెలుపొందడం కోసం సూచనలు ఇస్తే వినడానికి మాత్రమె వచ్చానని రాహుల్ నిర్మోహటంగా చెప్పిన్నట్లు తెలిసింది.

పత్రికా సంపాదకులతో రాహుల్ సమావేశం జరుగుతుండగా ఆ వేదిక వద్దకు ప్రతిపక్ష నేత కే  జానారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది ఆపినట్లు సమాచారం. దీంతో ఆయన అలకబూని బయటకు వెళ్లేందుకు ప్రయత్నింగా అక్కడే ఉన్న గూడురు నారాయణ రెడ్డి జానారెడ్డిని బతిమాలి లోపలికి పంపించినట్లు తెలుస్తుంది.

పార్టీ సీనియర్ల సమావేశానికి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలను  అనుమతించకపోవడం వివాదస్పదమైంది. సీనియర్ల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వీరిద్దరికి పాస్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తున్నది. తనను సీనియర్ గా గుర్తించకపోవడంపై రేవంత్ ఆగ్రహం వెలిబుచ్చినట్లు చెబుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి కంటతడిపెట్టి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.

ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల(కాంగ్రెస్ మద్దతుదారులు)తో జరగాల్సిన భేటీ కూడా రద్దు అయింది. రాహుల్ తో భేటీ కంటే ముందే కాంగ్రెస్ మద్దతుదారులైన విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగిన్నట్లు చెబుతున్నారు.