సిద్దరామయ్య ఇక ఎన్నికలకు దూరం !

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వ సమన్వయ కమిటీ ఛైర్మన్‌ సిద్దరామయ్య ఇక తాను ఎన్నికలలో పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. బాగల్‌కోట జిల్లా బాదామి తాలూకా గుళేదగుడ్డ పట్టణలో పురసభ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొంటూ అభివృద్ధి కోసం కృషిచేయాలనుకునేవారు ఎన్నికలలో పోటీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు.

ప్రస్తుతం తాను ఉత్తర కర్ణాటక వాసినే అని అంటూ ఇప్పటికే 13సార్లు ఎన్నికలలో పోటీ చేశానని, ప్రజల ఆశీర్వాదాలకు అనుగుణంగా ప్రతి పదవిలోను సేవ చేశాననని గుర్తు చేసారు. ఇకపై ఎన్నికలలో పోటీ చేయనని స్పష్టం చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల ముందే ఇవే తనకు చివరి ఎన్నికలని, మళ్ళి పోటీ చేయబోనని ప్రకటించిన సిద్దరామయ్య ఆ ఎన్నికలలో ఆయన ప్రభుత్వం పరాజయం చెందడంతో అధికారానికి దూరం కావలసి వచ్చింది. అయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర వహించడం ద్వారా రాష్ట్ర రాజకీయాలలో ఇంకా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఈ మధ్యనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా కుడా నీయమితులయ్యారు.

ఇటీవలే మరోసారి ముఖ్యమంత్రి అవుతానని వ్యాఖ్యానించడంతో సంకీర్ణ ప్రభుత్వంలో దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి కుమారస్వామిని గద్దె దింపి, ప్రభుత్వం ఏర్పాటుకు  సిద్దరామయ్య ప్రయత్నిస్తున్నారనే సంకేతాలు ఇచ్చిన్నట్లు అయింది. అయితే తన అభిప్రాయం ఇప్పుడు కాదని, తర్వాత ఎన్నికలలో అంటూ వివరణ ఇచ్చుకున్నారు.

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలలో నెలకొన్న అస్పష్టతను పారద్రోలే విధంగా తాజాగా వచ్చే ఎన్నికలలో పోటీ చేసేది లేదని చెప్పడంతో కాంగ్రె్‌సలో ఆ కీలక పదవిపై ఆశలు పెట్టుకున్న మరింత మంది ఉత్సాహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.