ఆజాద్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ

తనను ఎన్నికల ప్రచారానికి పిలిచే హిందువుల సంఖ్య తగ్గిపోయిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన  బిజెపి ప్రతిపక్ష పార్టీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహారిస్తుందని  విమర్శించింది.

బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర మాట్లాడుతూ ఆజాద్‌ను తక్కువ మంది ప్రచారానికి పిలువడానికి ఆయన హిందూ, ముస్లింలను వేరుగా చూడటమే కారణమని ఆరోపించారు. పైగా కాంగ్రెస్ అస్తిత్వం కోల్పోవడం అందుకు ప్రధాన కారణం కాగా దానికి మతం రంగు పూయడం  ఏమిటని ప్రశ్నించారు.

 బీజేపీ అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీని ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ప్రయత్నిస్తుందనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు.  ఉగ్రవాదులకు ప్రార్ధన సమావేశాలు జరపడాన్ని అనుమతిస్తామా అని ప్రశ్నించారు.

గతవారం `భారత్ వ్యతిరేక’ నినాదాలు ఇవ్వడంతో పాటు ఉత్తర కాశ్మీర్ లో బద్రతాదళాల చేతిలో మృతి చెందినా హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ మనన్ బషీర్ వాని మృతికి సంతాప సూచికంగా ప్రార్ధన సమావేశం జరుపుతూ ఉంటె ముగ్గురు కాశ్మీరి విద్యార్ధులపై ఆలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో రాజద్రోహం నేరం క్రింద కేసులు నమోదు చేసి, వారిని సస్పెండ్ చేసారు. తర్వాత ఇద్దరిపై సస్పెన్షన్ ను యూనివర్సిటీ తొలగించింది.

కాగా గతంలో కాశ్మీర్ లో తీవ్రవాదులను కన్నా ఎక్కువమంది పౌరులను సైనికులు చంపి వేస్తున్నారని అంటూ ఆజాద్ చేసిన వాఖ్యాలను బిజెపి నేత గుర్తు చేసారు. ఆజాద్ కు పాకిస్తాన్ లో ప్రచారం చేయాలనీ ఉన్నట్లున్నది అని ఎద్దేవా చేసారు.

హిందువులపై కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ “హిందూ తాలిబాన్”, “హిందూ పాకిస్తాన్”, “హిందూ ఉగ్రవాదులు” వంటి పదాలను వాడారని గుర్తు చేసారు. తన పార్టీ నేతల వైఖరిపై కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించాలని సంబిట్ పాత్ర డిమాండ్ చేసారు.

కాగా, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆజాద్‌ మాట్లాడుతూ       ‘నేను యూత్‌ కాంగ్రెస్‌ నాయకునిగా ఉన్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశాను. గతంలో నన్ను 95 శాతం హిందూ సోదరులు, 5శాతం ముస్లిం సోదరులు ప్రచారానికి పిలిచేవారు.

కానీ గత నాలుగేళ్లలో నన్ను ప్రచారానికి పిలిచే హిందూ సోదరుల సంఖ్య 20 శాతం పడిపోయింది. నేను వారి తరఫున ప్రచారం చేస్తే ఓట్లు రావాని వారు భయపడుతున్నారు.  అందుకే నన్ను పిలవడానికి ఇష్టపడటంలేద’ని ఆవేదన వ్యక్తం చేసారు.