డబ్బు తరలిస్తూ పట్టుబడ్డ టీడీపీ నేత వల్లభనేని

 

తెలంగాణలో ఎన్నికల వేళ హైదరాబాద్‌లో గురువారం భారీ మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడింది. తెలుగు యువత వైస్‌ ప్రెసిడెంట్‌ వల్లభనేని అనిల్‌ కారు డ్రైవర్‌ మహేశ్‌ వద్ద నుంచి పోలీసులు 60 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనిల్‌ ఆదేశాలతోనే డబ్బు తరలిస్తున్నట్టు మహేశ్‌ పోలీసులకు తెలిపారు.

హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్న టీడీపీ నాయకుడు వల్లభనేని అనిల్‌ను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి జగిత్యాలకు డబ్బు తరలిస్తుండగా అనిల్‌తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.

నిందితుల నుంచి కారు, నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదును ఆదాయ పన్ను శాఖకు పోలీసులు అప్పగించారు. ఎన్నికల కోసమే నగదును జగిత్యాలకు తరలిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. డబ్బు రవాణాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డబ్బు తరలిస్తున్న కారు నెంబర్ - ఏపీ 09 సీఎఫ్ 1144.

 భారీ మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు జగిత్యాలకు ఎందుకు తరలిస్తున్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.