కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ ఎన్డీ తివారీ మృతి

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ ఎన్డీ తివారీ (92) క‌న్నుమూశారు. అనారోగ్యంతో ఢిల్లీ లోని సాకేత్ మాక్స్ ఆసుప‌త్రిలో సుమారుగా నెల రోజులుగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. తన 93వ జన్మదినం రోజుననే చనిపోయారు. ఉత్తర ప్రదేశ్ కు మూడు సార్లు, ఉత్త‌రాఖండ్ కు ఒకసారి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా పలు సేవలు అందించారు. ఉత్తరాఖండ్ లో పూర్తికాలం ఐదేళ్ళు పదవిలో ఉన్నప్పటికీ ఉత్తర ప్రదేశ్ లో మూడు సార్లు కుడా ఒక సంవత్సరంకు మించి పదవిలో ఉండలేక పోయారు.

1963లో కాంగ్రెస్ లో చేరిన తివారి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక రాజకీయ నేత అని చెప్పవచ్చు. మొదటిసారిగా 1976లో, తర్వాత 1984లో, చివరిసారిగా 1988లో ఉత్తర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాస్త్రానికి ఆయనే చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావడం విశేషం. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా 1989 ఎన్నికలలో ఓడిపోయినా కాంగ్రెస్ తిరిగి 28 ఏళ్ళుగా మళ్ళి రాష్ట్రంలో అధికారంలోకి రాలేక పోతున్నది.

పార్లమెంట్ ఉభయ సభలలో సభ్యుడిగా కొనసాగారు. కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖలను నిర్వహించారు. రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో విదేశాంగ శాఖను నిర్వహించారు. రాజీవ్ గాంధీ మరణం అనంతరం 1991లో కేంద్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాన మంత్రి పదవికి ఆయనకే తొలి ప్రాధాన్యత లభించి ఉండెడిది. అయితే లోక్ సభ ఎన్నికలలో ఓటమి చెందడంతో ఆ అదృష్టం పివి నరసింహారావును వరించింది.

సోనియా గాంధీకి సన్నిహితంగా ఉన్న ఆయన పివి నరసింహారావు పై తిరుగుబాటు చేసి, కాంగ్రెస్ నుండి బైటకు వచ్చి అర్జున్ సింగ్ తో కలసి కాంగ్రెస్ (తివారి)ని ఏర్పాటు చేసారు. తిరిగి సోనియా గాంధీ కాంగ్రెస్ అద్యక్ష పదవి చేపట్టిన తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. 2002లో ఉత్తరాఖండ్ కు మొదటి ముఖ్యమంత్రి కాగలిగారు. రాష్ట్రంలో ఐదేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఆయనే.

2007 నుండి 2009 వరకు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నారు. ఒక స్టింగ్ ఆపరేషన్ లో రాజ్ భవన్ లో ముగ్గురు యువతులతో కలసి నిద్రిస్తున్న చిత్రాలు బయటకు రావడంతో ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. అప్పటి నుండి ఏ పదవి చేపట్టలేక పోయారు.

తర్వాత ఢిల్లీ న్యాయవాది రోహిత్ శేఖర్ ఎనీ వ్యక్తి తివారి తన తండ్రి అంటూ కోర్ట్ కు వెళ్ళడంతో వివాదంలో చిక్కుకున్నారు. మొదటి ఒప్పుకోలేదు. డి ఎన్ ఏ టెస్ట్ కు కుడా అంగీకరించ లేదు. తన తల్లి ఉజ్జ్వలతో గల వైవాహికేతర సంబంధంతో తాను జన్మించానని శేఖర్ కోర్ట్ లో వాదించడం, కోర్ట్ 2014లో అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. గత జనవరిలో ఉత్తరఖండ్ ఎన్నికల సందర్భంగా కొడుకు రోహిత్ తో కలసి బిజెపి లో చేరారు. కానీ రాజకీయంగా క్రియాశీలకంగా లేరు.