పరిపూర్ణానంద నగర బహిష్కరణ ఎత్తివేత

తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హై కోర్ట్ లో చుక్కెదురైంది. పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణ ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆంక్షలను హై కోర్ట్ ఎత్తివేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పరిపూర్ణానంద రెచ్చగొట్టే వాఖ్యలు చేశారంటూ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధి నుంచి ఆయనను బహిష్కరిస్తూ ఆయా కమిషనర్లు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.

 

శ్రీరాముడిపై కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులు నగర బహిష్కరణ విధించారు. అనంతరం నెల రోజుల క్రితం పరిపూర్ణానంద స్వామీజీపై కూడా బహిష్కరణ వేటు వేశారు. అయితే తనపై బహిష్కరణను ఎత్తివేయాలంటూ పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద వినతిని పరిశీలించిన హైకోర్టు ఆయనపై బహిష్కరణను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

 

పరిపూర్ణానంద స్వామీజీపై నగర బహిష్కరణను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, భజరంగ్ దళ్, విశ్వహిందూపరిషత్, సంఘ్ పరివార్ శ్రేణులు సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.