జనసేనలో టిటిడి మాజీ చైర్మన్ చదలవాడ

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీలో చేరిన వారం రోజులకే మరో కీలక నేత చేరారు. టిటిడి మాజీ ఛైర్మన్‌, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేనలో చేరారు.

శ్రీకాకుళం జిల్లలో తుఫాన్ బాధితుల పరామర్శకు వచ్చిన పవన్‌కల్యాణ్ ను అక్కడకు వెళ్లి  చదలవాడ కలిసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా చదలవాడకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయన తిరుపతి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్ల దాడిలో చంద్రబాబునాయుడు గాయపడిన సాయమలో ఆయనతో పాటు కారులో ఉన్న చదలవాడ కుడా గాయపడారు. అయితే 2004 ఎన్నికలలో పార్టీ సీట్ ఇవ్వకుండా దూరంగా నెట్టడంతో కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరిగి తెలుగు దేశం పార్టీలో చేరినా గత ఎన్నికలలో కుడా సీట్ ఇవ్వకుండా, పార్టీకి ఆయన చేసిన సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు.

ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత తిరిగి పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీలో చేరనున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన గురువారం పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు.

అటు కాంగ్రెస్‌ నుంచి, ఇటు టిడిపి నుంచి కీలక నేతలు తమ పార్టీలో చేరినందున ఎన్నికల లోపు ఇతర పార్టీల నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి.