టిడిపిలో చిప్పలు, చెప్పులు దొంగిలించే దొంగలే

కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌ నిందితులు, దుర్గగుడిలో కొబ్బరి చిప్పలు, చెప్పులు దొంగిలించే దొంగలే టీడీపీలో ఉన్నారని బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు. టీడీపీ నేతలు ఉపయోగించే బాష అభ్యంతరకరంగా ఉందని నిరసన వ్యక్తం చేసారు.  దీనిపై గతంలో ధర్నా కుడా చేశామని తెలిపారు. టీడీపీ అధినేతను తెలంగాణ సీఎం కేసీఆర్‌ తిట్టగానే అందరూ దాని గురించే మాట్లాడుతున్నారని, కానీ మోదీని చంద్రబాబు తిట్టినప్పుడు మీరంతా ఏం చేశారని ప్రశ్నించారు.

ఒళ్లు దగ్గర పెట్టుకుని టీడీపీ నేతలు మాట్లాడాలని కన్నా హితవు చెప్పారు.  టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌, జీవీఎల్‌ నరసింహారావును టీవీ లైవ్‌లో పచ్చిబూతులు తిట్టారని మండిపడ్డారు. టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటూ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని దయ్యబట్టారు. శవాల మీద పైసలు ఏరుకునే విధంగా టీడీపీ నేతల ప్రవర్తన ఉందని ద్వజమెత్తారు.

కేంద్రాన్ని తిట్టి సీఎం బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని కన్నా మండిపడ్డారు. చంద్రబాబు, తిత్లీ విపత్తును కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

కాగా, ఈ వారం మరో ఇదు ప్రశ్నలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉద్దేశించి విడుదల చేస్తూ పల్నాడులో అక్రమ మైనింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించుకోగలరా ? అని సవాల్ విసిరారు. ఎస్టిమేషన్లు పెంచి సీఎం రమేశ్‌కు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని నిలదీసారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బా రెడ్డిలను కూర్చోబెట్టి వాటాలు పెంచుకోమని చెప్పలేదా? అని ప్రశ్నించారు. రూ.480 కోట్ల రూపాయలతో నిరుద్యోగులకు ఇచ్చే శిక్షణకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడంలో అంతర్యం ఏమిటని అడిగారు. ఐటీ దాడులు చేస్తే రాష్ట్రంలో భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.