కేసీఆర్ మేనిఫెస్టో.. గులాబి గ్రాఫిక్స్ సినిమా

ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన ట్రయల్ మేనిఫెస్టో  గ్రాఫిక్స్ తో కూడిన  గులాబి రంగు సినిమా చూపిస్తారని  బిజెపి నేత జి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేక పోయారో కేసీఆర్ చెబితే బాగుండేదని చురక అంటించారు. గత హామీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చినప్పుడే ఓట్లు అడుగుతా అని చెప్పిన కేసీఆర్, అవి పూర్తి కాకుండానే ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారో చెప్పాలని నిలదీశారు.

తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్, ఏర్పడిన తరువాత టీఆర్‌ఎస్ తమ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి  పూర్తిగా దిగజారిందని, బిల్లులు చెల్లించలేని స్థితిలో రాష్ట్రం ఉందని చెబుతూ కేసీఆర్ తన పాలనలో అప్పులు తేవడం, మద్యం అమ్మకాలు పెంచడం తప్ప ఏమీ చేయలేదని ఆరోపించారు. కేంద్రం నుంచి వస్తున్న ఉపాధి నిధులను ఒక చేత్తో పట్టుకున్న కేసీఆర్, మరో చేత్తో మద్యం బాటిల్‌ను ప్రజలకు అందిస్తున్నారని విమర్శించారు.  మద్యం అమ్మకాలు పెంచడం ద్వారా అనేక మంది చనిపోవడానికి కేసీఆర్ కారణమయ్యారని ద్వజమెత్తారు.

టీఆర్‌ఎస్ పాలన సరిగా లేనందునే ఇప్పుడా పార్టీ అభ్యర్థులు గ్రామాల్లో తిరగలేక పోతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో అమలు చేసిన రుణమాఫీ సరిగా లేదంటూ కేసీఆర్ ఒప్పుకోవడాన్ని ప్రస్తావిస్తూ ఈ పథకంలో పొరపాట్లు జరిగాయని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నట్టయిందని చెప్పారు. పంటల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామంటూ కేసీఆర్ ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ ఇన్నాళ్లకు మీకు జ్ఖానోదయమైందా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అధికారం కోల్పోయిన కాంగ్రెస్, తెలంగాణలో అధికారంలోకి రావాలన్న దింపుడు కళ్లెం ఆశతో ఉందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఉత్తర కుమారుడిలా మాట్లాడుతున్నారని అంటూ రాష్ట్రంలో ప్రజలు చెల్లిస్తున్న పన్నులతోనే పనులు చేస్తున్నారు కానీ, మీ ఇంట్లో నుంచి ఏమైనా ఖర్చు చేస్తున్నారా? అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ సినిమా అన్ని రాష్ట్రాల్లో ఫ్లాప్ అయిందని, తెలంగాణలో కూడా ఆ సినిమా ప్లాప్ అవుతుందని స్పష్టం చేసారు. అమిత్ షా సినిమా అన్ని రాష్ట్రాల్లో హిట్ అయిందని, తెలంగాణలోనూ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆచరణ, అమలు సాధ్యం కానీ హామీలను గుప్పిస్తున్నాయని పేర్కొంటూ ఆయా పార్టీల మోసపు హామీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కిషన్ రెడ్డి హెచ్చరించారు.  కాంగ్రెస్ ఉచ్చులో టీఆర్‌ఎస్ పడిపోయిందని చెబుతూ కాంగ్రెస్ గోకితే టీఆర్‌ఎస్ తిరిగి గోకుతోందని, ఈ రెండు పార్టీలు కలిసి ప్రజల నెత్తిన చేయి పెడుతున్నాయని విమర్శించారు.