డిఎంకె నాయకత్వం స్టాలిన్ వెనుకే !

డిఎంకె నాయకత్వం కార్యనిర్వాహక అద్యక్షుడు ఎంకే స్టాలిన్ కు అండగా నిలబడింది. మృతి చెందిన తండ్రి కరుణానిధి స్థానంలో పార్టీ నాయకత్వాన్ని చేపట్టాలని అంటూ పార్టీ కార్యవర్గ సమావేశంలో దాదాపు నాయకులు అందరు కోరారు. ఈ సమావేశానికి ముందు రోజు పార్టీ కార్యకర్తలు తన నాయకత్వం కోరుకొంతున్నారని అంటూ స్టాలిన్ అన్న ఎంకే అలిగిరి పేర్కొనడంతో ఏర్పడిన రాజకీయ గందరగోళ కార్యవర్గ సమావేశంతో ముగిసింది.

“పార్టీ అధినేత ఇప్పుడు మన మధ్య లేరు. ఇప్పుడు ఎవరోచ్చి పార్టీకి సారధ్యం వహించాలో ఎవ్వరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కార్యనిర్వాహక అద్యక్షుడు స్టాలిన్ నేరుగా వచ్చి సారధ్యం వహించండి” అంటూ మాజీ కేంద్ర మంత్రి టి ఆర్ బాలు స్పష్టం చేసారు. ప్రసంగించిన వారంతా స్టాలిన్ ఏ తమ నాయకుడని ప్రకటించారు.

కాగా ఈ సమావేశంలో స్టాలిన్ భావోద్వేగానికి గురయ్యారు. “మీరంతా పార్టీ సారధిని మాత్రమె కోల్పోయారు. నేను నాయకుడితో పాటు తండ్రిని కుడా కోల్పోయాను” అంటూ ఉద్విగ్తత స్వరంతో చెప్పారు. తండ్రి అంత్యక్రియలు మెరీనా బీచ్ లో జరపమని స్వయంగా వెళ్లి కోరినా ముఖ్యమంత్రి పలనిస్వామి తిరస్కరించడం పట్ల తీవ్ర స్వరంతో ద్వజమెత్తారు.

'కలైంజ్ఞర్ ఆఖరి ఘడియల్లో నేను ముఖ్యమంత్రి చేతులు పట్టుకుని మెరీనా బీచ్‌లో తనను సమాధి చేయాలన్న కరుణానిధి చివరి కోరికను ఆయన దృష్టికి తెచ్చాను. అంగీకరించాలని వేడుకున్నాను. అయితే ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నా అభ్యర్థనను తోసిపుచ్చింది' అని మండిపడ్డారు. మెరినా బీచ్‌లోనే కరుణానిధి అంత్యక్రియలకు కోర్టు గ్రీన్‌సిగ్నిల్ ఇవ్వడం వెనుక పూర్తి క్రెడిట్ లాయర్లకే దక్కుతుందన్నారు. 'అదే జరిగి ఉండకపోతే మా నేతతో పాటు నేను కూడా సమాధి అయి ఉండేవాడినే' అంటూ స్టాలిన్ భావోద్వేగానికి గురయ్యారు.